హిందూ మతంలో ప్రతి రోజు ఒక విశేష దేవతకు అంకితంగా ఉంటుంది. ఆ పరంపరలో శుక్రవారం రోజు మాతా లక్ష్మీకి ప్రత్యేకమైనది. లక్ష్మీదేవిని భక్తులు సిరిసంపదల దేవతగా ఆరాధిస్తారు. శుక్రవారం రోజున ఉపవాసం ఉండటం, ప్రత్యేక పూజలు నిర్వహించడం, ఆమెను ప్రసన్నం చేసుకోవడం అనేది ఆచారంగా వస్తోంది. ఎందుకంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభించిన ఇంట్లో ఐశ్వర్యం, శాంతి, సంతోషం చేకూరుతాయనే విశ్వాసం ఉంది.మరి లక్ష్మీ దేవిని సంపదల దేవత అని ఎందుకు పిలుస్తారో తెలుసా? అమ్మవారికి అసలు ఆ కీర్తి ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం..
లక్ష్మీదేవి జననం – పురాణకథ
లక్ష్మీదేవి జననానికి సంబంధించి పలు పురాణాలలో విభిన్న కథలు ఉన్నాయి. అయితే, విష్ణు పురాణం ప్రకారం గల కథ అత్యంత ప్రసిద్ధమైనది:
ఒకసారి దుర్వాస మహర్షి కల్పవృక్ష మాలను దేవేంద్రునికి కానుకగా ఇచ్చాడు. దేవేంద్రుడు ఆ మాలను తాను వాహనంగా ఉపయోగించే ఏనుగుకు వేసాడు. ఆ ఏనుగు అప్రమత్తత లేకుండా ఆ మాలను కింద వేసి తొక్కింది. దుర్వాసుడు కోపంతో “నీ రాజ్యంలో నుంచి లక్ష్మీ తొలగిపోవాలి” అని శాపం ఇచ్చాడు.
దీంతో స్వర్గంలో ఐశ్వర్యం, శక్తి నశించిపోయింది. రాక్షసులు బలవంతులు అయ్యి స్వర్గాన్ని ఆక్రమించారు. దీనివల్ల ఇంద్రుడు ఇతర దేవతలతో కలిసి బ్రహ్మదేవుని ఆశ్రయించాడు. బ్రహ్మదేవుడు విష్ణుదేవుని ఆశ్రయించగా, విష్ణువు క్షీరసాగర మధనం చేయాలని సూచించాడు. అమృతాన్ని పొందడం ద్వారా బలాన్ని సంపాదించి రాక్షసులను ఓడించవచ్చని వివరించాడు.
క్షీరసాగర మథనం – లక్ష్మీదేవి ఆవిర్భావం
దేవతలు, రాక్షసులతో కలిసి క్షీరసాగరాన్ని మథించగా అనేక విలువైన వస్తువులు బయటికొచ్చాయి:
- హాలాహలం (విషం),
- కామధేనువు,
- ఐరావతం,
- కల్పవృక్షం,
- అమృతం,
- మరియు… లక్ష్మీ దేవి!
ఆమె పద్మంలాంటి హస్తాలతో, అద్భుతమైన తేజస్సుతో క్షీరసాగరములోనుంచి వెలసింది. ఆమె వెంట ఐశ్వర్యం, శ్రేయస్సు, సంతుష్టి కూడా బయలుదేరాయి. లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుని వరించి ఆయన్ను తన భార్యగా ఎంచుకుంది.
ఆమె పునరాగమనంతో ముల్లోకాలకూ మళ్లీ సుఖసంతోషాలు చేరాయి. దేవతలు అమృతాన్ని సేవించి అమరులయ్యారు. ఇంద్రలోకంలో మళ్లీ శ్రీవైభవం తిరిగి వచ్చింది. అప్పటి నుంచే లక్ష్మీదేవిని సంపదల, శ్రేయస్సు, శాంతికి ప్రతీకగా భావించి, శ్రద్ధగా పూజించడం మొదలైంది.
శుక్రవారం లక్ష్మీపూజ – భక్తి సంకల్పం
పురాణకథల ప్రకారం శుక్రవారం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈరోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఆమె అనుగ్రహం అంతులేని శ్రేయస్సును అందిస్తుందని నమ్మకం. లక్ష్మి దేవిని సంపదలు, శ్రేయస్సు, వైభవానికి ప్రతీకగా కొలుస్తారు. ముఖ్యంగా శుక్రవారాన్ని లక్ష్మీ దేవికి ప్రతీకరమైన రోజుగా పురాణాలు పేర్కొంటాయి. అందుకే శుక్రవారం రోజు ప్రజలు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తారు.