నేడు మొదటి శ్రావణ మంగళవారం.
గౌరీదేవి పరమశివుని ఇల్లాలు.
పసుపు వర్ణంలో ఉంటుంది కనుక గౌరి అని, శుభాలను చేకూరుస్తుంది కనుక, మంగళగౌరి అని పిలుస్తారు.
వివాహ సమయంలోనూ, పెళ్లితరువాత ఇంటి సంప్రదాయాన్ని అనుసరించి శ్రావణమాసంలోనూ స్త్రీలు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు.
శ్రావణ మంగళవారం నాటి ఉదయాన్నే తలస్నానం చేసి, ఇంటిని శుభ్ర పరుచుకోవాలి. పూజగదిలో గానీ వ్రతం చేయదలుచుకున్న చోట గానీ మంటపాన్ని ఏర్పాటు చేసుకోవాలి.
ఈ మంటపం పైన బియ్యపు పిండితో అష్టదళ పద్మాలను ముగ్గుగా తీర్చిదిద్దాలి. దానిపై బియ్యం పోసి కలశాన్ని (చెంబు) ఉంచాలి. దానిలోపల మామిడాకులు వేయాలి. పైన కొబ్బరికాయ నిలపాలి. కొబ్బరికాయకు పసుపు, గోధుమపిండి మిశ్రమంతో ముక్కు, కళ్లు, చెవులను తీర్చిదిద్దాలి. దీనికి బదులుగా రూపు లేదా ప్రతిమను స్థాపించుకోవచ్చు. కొబ్బరికాయపై కొత్త రవికెను ఉంచాలి.
కలశానికి బదులుగా గౌరీదేవి ఫొటోని కూడా పూజించవచ్చు. పూజా పీఠాన్ని ఎవరి శక్తి కొద్దీ వారు అలంకరించుకోవచ్చు.
ఈ విధంగా అమ్మవారిని ప్రతిష్టించుకుని వ్రతం చేసుకోవాలి.
ప్రతివారం ఒకే మంగళగౌరీదేవి విగ్రహాన్ని ఉపయోగించాలి.
వారానికొక కొత్త విగ్రహాన్ని ఉపయోగించకూడదు
వివాహమైన తరువాత కొత్తపెళ్లికూతురు తొలిగా నోచుకునే నోము మంగళగౌరి.
పెళ్లికి ముందు గౌరీపూజ, పెళ్లి తరువాత వరుసగా అయిదేళ్లపాటు మంగళగౌరీ వ్రతం చేయడం సకలసౌభాగ్యాలను ఇస్తుందని నమ్ముతారు.
తొలిసారి ఈ నోము పుట్టినింట చేయడం మంచిది. తొలివాయనం తల్లికి ఇవ్వాలి. ఒకవేళ తల్లి లేకపోయినట్లయితే అత్తగారు లేదా ఇతర ముత్తైదువల సహాయంతో నోము ఆచరించవచ్చు. కానీ వాయనం మాత్రం అత్తగారికి ఇవ్వరాదు.
ముత్తైదువల సూచనలతో ఆచార సంప్రదాయాలను శక్తిమేరకు పాటించాలి. వ్రతం రోజున ఐదుగురు ముత్తైదువలను వాయనాలు అందుకోవడానికి పిలుచుకోవాలి. శక్తిని బట్టి, ఆచార సంప్రదాయాలను బట్టి వాయనములు ఇవ్వవచ్చు.
ఈ వ్రతం చేయడం వల్ల భర్త ఆరోగ్యం, ఆయుష్యు బాగుంటుందని అలాగే తరగని సిరిసంపదలతో సుఖసౌఖ్యాలతో జీవిస్తారనీ మహిళల విశ్వాసం